కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కుట్ర చేస్తున్నారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మళ్లీ సెంటిమెంట్ ను రగిలించి బీజేపీని బద్నాం చేయాలని కేసీఆర్ ఫ్యామిలీ చూస్తోందని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ, మోడీ వ్యతిరేకం అనే ప్రచారం టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీ, తెలంగాణను కలుపుతారని కేటీఆర్ అనడంపై ఫైరయ్యారు రఘునందన్. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఇండియాలో కలిపేస్తామన్నారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ మాటకు కట్టుబడి ఉత్తర భారతదేశానికి చెందిన ఎంపీలు ఓటు వేయడంతో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో అలజడి సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు రఘునందన్. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరారు. తెలంగాణలోని మూడు జిల్లాలకు ఎన్ని నిధులు వెళ్లాయి.. మిగతా జిల్లాలకు ఎన్ని మంజూరు చేశారనే విషయంపై చర్చించేందుకు సిద్ధమన్నారు.
ఇంటికి 10 లక్షలు ఇచ్చినా టీఆర్ఎస్ కు ఓట్లు పడవనే భయంతో మళ్ళీ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు రఘునందన్. ప్రధానిని తిడుతున్న టీఆర్ఎస్ నేతలు రాజకీయాల్లోకి రాకముందే మోడీ ఒక రాష్ట్రానికి సీఎం అని గుర్తు పెట్టుకోవాలన్నారు. సీఎంతో మాట్లాడడానికి ఓ స్థాయి ఉండాలని అంటున్న హరీష్ రావు.. ఏ స్థాయి ఉండాలో కూడా చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చెల్లిని గౌరవించలేని భాష టీఆర్‌ఎస్ దని విమర్శించారు రఘునందన్.