గత రెండు, మూడు రోజులుగా గుడివాడలో క్యాసినో వ్యవహారంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. క్యాసినో నిర్వహించిన మాట వాస్తవమే. కానీ.. ఇందులో కొడాలి ప్రమేయం లేదని, పైనున్న వైసీపీ పెద్దలు ఎవరైనా చేసి ఉంటారని సంచలన వ్వాఖ్యలు చేశారు. ఇది ఏదో ఎటకారంగా చెప్తున్నది కాదు.. క్యాసినోతో కొడాలికి ఎలాంటి సంబంధం లేదని మనస్ఫూర్తిగా చెప్తున్నానని అన్నారు రఘురామకృష్ణంరాజు.
మంత్రి కొడాలి నానికి చెందిన కళ్యాణ మండపంలో ఈ క్యాసినో నిర్వహణ జరిగిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు బయటకొచ్చాయి. ఈ అంశంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. గుడివాడలో గోవా కల్చర్ తీసుకొచ్చారని, యువతని నాశనం చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. అలాగే నిజనిర్ధారణ కమిటీ పేరిట కొందరు టీడీపీ నేతలు గుడివాడలో పర్యటించడం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడం వంటివి కూడా జరిగిపోయాయి.
ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన సమయంలో ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ కరెక్ట్ కాదని.. ఎవరు కూడా ఈ డైవర్షన్ గేమ్ లో పడొద్దని రఘురామ ట్విట్ చేశారు. అంటే పరోక్షంగా టీడీపీకి చెప్పినట్లు కనిపిస్తోందని.. టీడీపీనే ఈ క్యాసినో వ్యవహారాన్ని భుజాన వేసుకుందని నెటిజన్ లు కామెంట్ లు పెడుతున్నారు. మొత్తానికైతే అందరినీ ఆశ్చర్యపరుస్తూ రఘురామ, కొడాలికి సపోర్ట్ చేయడం కొత్త ట్విస్ట్ అని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ వ్యవహారంపై కొడాలి నాని స్పందిస్తూ.. అసలు క్యాసినోతో తనకు సంబంధం లేదని.. పండగ రోజు అమ్మాయిలతో డ్యాన్సులు, క్యాసినో అంటూ వార్తలు వస్తే తానే డీఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. అయితే.. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు కొడాలి.