భారత్ జోడో పాదయాత్ర ముగిశాక ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజీ అయిపోతారనుకుంటే.. అది పక్కనబెట్టి ఆయన ఇంకా ఎంజాయ్ మూడ్ లోనే ఉన్నారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి .. కశ్మీర్ లోని గుల్ మార్గ్ మంచు తిన్నెల మీద స్కూటర్ రైడ్ చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. గుల్ మార్గ్ స్కై రిసార్ట్ లో వీరి స్కూటర్ రైడ్ తాలూకు ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది.
101 సెకండ్ల నిడివి గల ఈ వీడియోపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్,ఫేస్ బుక్, ఇన్స్ టా గ్రామ్ ..ఇలా అన్ని ‘వేదికల్లోనూ’ వీరి ‘వేడుకలు’ చర్చనీయాంశమయ్యాయి. వైరల్ అవుతూనే ఉన్నాయి.
వీరి వెంట ఇలాంటి స్నో స్కూటర్లను నడపడంలో అనుభవం ఉన్న ‘శిక్షకులు’ తగిన సూచనలు, సలహాలు ఇస్తుంటే రాహుల్, ప్రియాంక గాంధీ ఇంకా ఉత్సాహంగా వాహనాలను నడుపుకుంటూ పోయారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా సరేసరి !
అయితే వీరి ఎంజాయ్ మెంట్ చూశాక కొందరు ట్విట్టర్ యూజర్లు ..ప్రొఫెషనల్ కి, పర్సనల్ లైఫ్ కి మధ్య తులనాత్మకత అంటే ఇదే కాబోలు అని పొగిడితే.. మరికొందరు మాత్రం .. ఈ తరహా వీడియోలను విడుదల చేస్తే ఏ ఓటరైనా ఇలాంటి లీడర్లను సీరియస్ గా తీసుకుంటాడా అని పెదవి విరిచారు. సమస్యల్లో ఉన్న ప్రజలకు వీరిచ్చే సందేశం ఇదేనా అని వారు ప్రశ్నించారు.