టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమర్థతకు పరీక్ష ఎదురవుతోంది. ఓ వైపు మునుగోడు ఎన్నికల తేదీ దగ్గరకు వస్తోంది. అదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించబోతోంది. ప్రచారం పీక్ స్థాయికి చేరుకునే సమయంలో రాహుల్ గాంధీ యాత్ర వస్తుండటంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది.
పార్టీ అగ్రనేత రాహుల్ ఈ నెల 23న తెలంగాణలో యాత్రను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే యాత్ర రూట్ మ్యాప్ ను ఫైనల్ కూడా చేశారు. ఈ యాత్ర ప్రచార బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించారు. తాజాగా యాత్ర ఏర్పాట్లలో వెనుకబడ్డారంటూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రేవంత్ ను ప్రశ్నించారు.
షెడ్యూల్ ప్రకారం… ఈ నెల 23న రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 375 కిలో మీటర్ల పాటు రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది. హైదరాబాద్ నగరంలోనూ యాత్ర నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ నెల 31న భారత్ జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశించనుంది.
హైదరాబాద్‌లో యాత్రను చార్మినార్ నుంచి ప్రారంభించనున్నారు.ఆ తర్వాత గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు యాత్ర చేరుకుంటుంది. ఇందిరాగాంధీ వర్దంతి సందర్బంగా నెక్లెస్ రోడ్‌లో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ఇది ఇలా వుండగా యాత్ర ముగిసిన నాలుగు రోజులకే మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. రాహుల్ యాత్ర నేపథ్యంలో పార్టీ నేతలందరూ యాత్రలో పాల్గొనడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ వెనకబడే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు రాహుల్ యాత్రకు కర్ణాటకలో అనూహ్య స్పందన లభించింది. తెలంగాణలోనూ మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రతిష్టాత్మక యాత్ర నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో ఈ యాత్ర రేవంత్ కు వ్యక్తిగతంగా చాలా కీలకం కానుంది. కాంగ్రెస్ కీలక నేతలంతా మునుగోడుకు దూరం అయితే తమకు మరింత కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అటు రాహుల్ యాత్ర, ఇటు మునుగోడు రేవంత్ సమర్థతకు పరీక్షగా మారనున్నాయి.