ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే ఇంధన ధరలు పెరుగుతున్నాయని.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సమాఖ్య స్ఫూర్తి దెబ్బతీసేలా.. ప్రధాని వ్యాఖ్యలున్నాయని విమర్శిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. మొత్తం ఇంధన పన్నుల్లో 68శాతం కేంద్రం విధిస్తూ.. రాష్ట్రాలను నిందించడం సరైనది కాదని ధ్వజమెత్తారు. అధిక ఇంధన ధరలు, బొగ్గు కొరత, ఆక్సిజన్ కొరత.. ఇలా అన్ని వైఫల్యాలను రాష్ట్రాలపై నెట్టివేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు ప్రధాని వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించకముందే తమిళనాడు ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించిందన్నారు ఆ రాష్ట్ర ఆర్థిక, మానవ వనరుల శాఖ మంత్రి. 2021 ఆగస్టులోనే తగ్గించామని గుర్తు చేశారు. దీని వల్ల రాష్ట్ర పౌరులకు లీటరుకు రూ.3 ఉపశమనం లభించిందని మంత్రి స్పష్టం చేశారు.
అయితే.. గత నవంబర్ లోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. వాటిపై రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ తగ్గించాలని కేంద్రం పేర్కొంది. దాన్ని చాలా రాష్ట్రాలు పాటించడం లేదని మోడీ లేవనెత్తారు. దీంతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.