భారత్ జోడో పాదయాత్రలో ఉన్న తన సోదరుడు రాహుల్ గాంధీకి ‘సత్యమే కవచం’ గా ఉందని, అందుకే ఆయనకు చలి వేయదని ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ‘సత్యాన్నే కవచం’గా ధరించిన ఆయనకు చలివేసే ప్రసక్తి ఎక్కడన్నారు. మంగళవారం యూపీ సరిహద్దులోని ‘లోనీ’ బోర్డర్ వద్ద ఆమె రాహుల్ యాత్రకు స్వాగతం పలికారు.
ఢిల్లీ వంటి నగరాల్లో కూడా రాహుల్ .. వణికించే చలిని కూడా లెక్క చేయకుండా .. టీ షర్ట్ నే ధరించి ఈ యాత్రలో పాల్గొనడంపై వస్తున్న కామెంట్స్ కి స్పందిస్తూ ప్రియాంక ఈ వ్యాఖ్య చేశారు. పైగా ఈ తీరుపట్ల ఇంటర్నెట్ కూడా ఆశ్చర్యంతో తలమునకలైంది. ఇంత శీతల వాతావరణంలోనూ మీరు తెల్లని టీ షర్టునే ధరించి నిర్విరామంగా యాత్ర ఎందుకు చేస్తున్నారని ఓ సందర్భంలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన.. ‘ఈ షర్టునే ఇప్పటికీ ధరిస్తూ వస్తున్నాను.. ఎంతకాలం ధరించాలో.. అంతకాలం కొనసాగిస్తాను’ అని సమాధానమిచ్చారు.
(జబ్ తక్ చల్ రహీ హై .. చలాయేంగే’ అన్నారు). కన్యా కుమారి నుంచి మూడు వేల కి.మీ. పాద యాత్ర చేసిన తన సోదరుడికి యూపీలో స్వాగతం పలకడం గర్వంగా ఉందని ప్రియాంక పేర్కొన్నారు. రాహుల్ పై ఆమె ప్రశంసలు ఇక్కడితో ఆగలేదు.. సోదరుడిని ఓ ‘యోధుడి’గా అభివర్ణించిన ఆమె.. అంబానీ, అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తలు సైతంఆయనను కొనలేరని అన్నారు. రాహుల్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆయన భయపడరని వ్యాఖ్యానించారు. ‘డియర్ బ్రదర్ ఐ యాం సో ప్రౌడ్ ఆఫ్ యు’ అన్నారు.
ఘజియాబాద్ లోని లోనీ సరిహద్దులో వందలాది పార్టీ కార్యకర్తలు రోడ్డుకు రెండువైపులా నిలబడి తమ నేతకు ఘన స్వాగతం పలికారు. వీరి తోను, రాహుల్ వెంట ఉన్న ఇతర నేతలు, కార్యకర్తలతోను ఆ ప్రాంతమంతా నిండిపోయింది.