ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టును టీమిండియా స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు అదర గొట్టడంతో మరో పది ఓవర్లు మిగిలి వుండగానే భారత్ విజాయన్ని అందుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇషాన్ కిషన్ కేవలం మూడు పరుగులు చేసి మార్కస్ స్టోయినీస్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు.
ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(4), సూర్య కుమార్ యాదవ్(0)లు మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవీలియన్ చేరారు. అనంతరం వచ్చిన బ్యాటర్ కేఎల్ రాహుల్ తో కలిసి మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ ను చక్క దిద్దాడు. ఆచి తూచి ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
శుభ్ మన్ గిల్ (20) పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో లబుషింగేకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. గిల్ స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్యా చెల రేగి ఆడాడు. పాండ్యా(25) మార్కస్ స్టోయినిస్ బౌలింగ్ లో క్యామెరున్ గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడే వచ్చిన రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా చూసుకుంటూ భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. కేఎల్ రాహుల్ (75), రవీంద్ర జడేజా(45) పరగులతో నాటౌట్ గా వున్నారు.
ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ (3), స్టోయినిస్ (2) వికెట్లు తీశారు. అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ జట్టులో మిచెట్ మార్ష్(81), స్టీవ్ స్మిత్(22), జోష్(26) పరుగులు చేశారు. మిగతా వారు ఎవరూ చెప్పుకోదగిన స్కోరు చేయకపోవడంతో 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది.