దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో కేంద్రీకృత విధానాలే సంపూర్ణంగా అమలవుతున్నాయన్నారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ లేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో ఫాసిజం రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు.
ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… దేశంలో పార్లమెంట్ పని చేయడం లేదేన్నారు. తాను రెండేళ్ళుగా మాట్లాడలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. తాను మాట్లాడిన వెంటనే వాళ్ళు తన మైక్రోఫోన్‌ను ఆఫ్ చేసేస్తారని చెప్పారు. అధికారాల సమతుల్యత లేదన్నారు.
దేశంలో హిందూ ముస్లింల మధ్య పోలరైజేషన్ ఉందన్నారు. కానీ ప్రభుత్వ మద్దతుగల మీడియా ప్రచారం చేస్తున్నంత తీవ్రంగా మాత్రం లేదని వివరించారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరక్ష రాస్యత, కొవిడ్ మహమ్మారి తర్వాత చిన్న తరహా, రుణగ్రస్థులైన వ్యాపారులు, భూమిలేని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు వంటి సమస్యలనుంచచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు దాన్ని ఓ సాధనంగా వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుతం కేంద్రీకృత విధానాలే అమలవుతున్నాయన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా లేదని ఆరోపించారు. ఇక భారత్ జోడో యాత్ర గురించి స్పందిస్తూ.. ఆ యాత్ర ఓ తపస్సు లాంటిదన్నారు. తనతో సహా ప్రతి ఒక్కరి పరిమితులు మనం అనుకున్నదాని కన్నా చాలా ఎక్కువ అని పేర్కొన్నారు.
సంస్కృతంలో తపస్య అని ఉందని దాన్ని పాశ్చాత్య మేధావులు అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పారు. దీన్ని చాలా మంది ‘త్యాగం’, ‘సహనం’ అంటూ అనువాదం చేస్తారని అన్నారు. కానీ దాని అర్థం తాపాన్ని సృష్టించడమని ఆయన వివరించారు. తాను నిర్వహించిన యాత్ర తాపాన్ని సృష్టించేదని కాదన్నారు. మీ లోపలికి మీరు చూసుకునేలా చేస్తుందన్నారు.
ప్రతిపక్షాలన్నీ ఏకమైతే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడం నూటికి నూరు శాతం సాధ్యమేనని ఆయన తేల్చి చెప్పారు. రైట్ లేదా లెఫ్ట్ కానటువంటి విజన్‌ను వ్యతిరేకిస్తే ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు. శాంతి, సమైక్యతల కోసం మోడీని ఓడించవచ్చునని ఆయన అన్నారు. ఓ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తే ఫాసిజం ఓడిపోతుందని ఆయన తెలిపారు. భారత దేశపు రెండు దార్శనికతలు ఒకదానితో మరొకటి పోటీ పడితే, తమదే ఆధిపత్యమని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విదేశాంగ విధానానికి సంబందించినదన్నారు. కానీ దానికి శాంతియుత పరిష్కారాలు అవసరమన్నారు. ప్రధాని నెహ్రూ తనకు తెలియదన్నారు. కానీ ఆయన్ని తన మార్గదర్శకుడిగా భావిస్తానని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనను ఎంతో ఆత్మీయంగా చూసేవారని చెప్పారు.
తనకు బచ్చలి కూర, బఠాణీలు అంటే ఇష్టం ఉండదన్నారు. కానీ అన్ని కూరలు తినాలని తన తండ్రి రాజీవ్ గాంధీ కట్టుదిట్టంగా వ్యవహరించేవారని చెప్పారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ఓ వార్తాపత్రికను తనకు చూపించే వారని, ఆ పత్రిక చదవమనేవారన్నారు. ఆ సమయంలో పత్రిక మాటున తాను తన పళ్లెంలోని బచ్చలి కూర, బఠాణీలను ఆమె పళ్లెంలో పెట్టేసేవాడినని తెలిపారు.
ఇందిర గాంధీకి ఆమె మరణం గురించి తెలుసునని చెప్పారు. తాను మరణించిన రోజు నువ్వు ఏడవద్దని, కనీసం బహిరంగంగా ఏడవద్దంటూ సూచించారని అన్నారు. రాజీవ్ గాంధీకి కూడా ఆయన మరణం గురించి ఆయనకు తెలుసునన్నారు. ఆయన్ని చంపేది తమిళ టైగర్స్ అని ఆయనకు తెలుసో, లేదో తనకు తెలియదన్నారు. కానీ తన ప్రాణాలకు ముప్పు కలిగించే శక్తులు, ప్రయోజనాలు, బలగాలు ఏకమవుతున్నాయని ఆయన భావించారని చెప్పారు.
మీ ప్రాణం గురించి మీరు భయపడుతున్నారనే వార్తలపై మీరేమంటారన్న దానిపై ఆయన మాట్లాడుతూ…. అది భయపడే విషయం కాదన్నారు. తానేం చేయాలో అది చేస్తానని చెప్పారు. తనకు పిల్లలుండటాన్ని ఇష్టపడతానన్నారు. అయితే 52 ఏళ్ళు వచ్చినా తాను ఇంకా ఎందుకు వివాహం చేసుకోలేదనేదానిపై ఖచ్చింతంగా చెప్పలేనన్నారు.