ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ మేరకు ఉక్రెయిన్ లోని ఓ బంకర్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు.
‘ రష్యా దాడుల నేపథ్యంలో చాలా మంది భారతీయ విద్యార్థులు తూర్పు ఉక్రెయిన్ లో చిక్కుకున్నారు. అక్కడ బంకర్లలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా నిలబడతాను. విద్యా్ర్థులను భారత్ కు తరలించే ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేయాలని కోరుతున్నాను” అని ట్వీట్ చేశారు.
‘ ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఎయిర్ ఇండియా విమనాలు రొమేనియాకు శనివారం చేరుకున్నాయి. ఈ విమానంలో సుమారు 470 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలిస్తాము. ఎయిర్ ఇండియా విమానం రొమేనియా నుంచి ఢిల్లీకి చేరుకోగానే మరో రెండు విమానాలు ఢిల్లీ నుంచి రొమేనియాకు వెళ్లాల్సి ఉంది” అని భారత విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.
ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు భారతీయ విద్యార్థులు చేరుకుంటున్నారు. వారిని బుచరెస్ట ప్రాంతానికి అధికారులు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వారిని ఎయిర్ ఇండియా విమానం ద్వారా ముంబైకి తీసుకురానున్నారు. ముంబైలో వారికి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్వాగతం పలుకుతారని అధికారులు తెలిపారు..