కాంగ్రెస్ కు సామాన్యులతో సంబంధాలు తెగిపోయాయని, వాటిని ప్రజల్లోకి వెళ్లడం ద్వారా సరిదిద్దు కోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ చింతన్ శివిర్ సమావేశంలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు.
‘ ప్రజలతో మన పార్టీకి సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని మనం అంగీకరించాలి. ప్రజలతో మన అనుబంధాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఇది షార్ట్ కట్ లో జరిగే పని కాదు. దీనికి తీవ్రమైన కృషి అవసరం’ అని పేర్కొన్నారు.
ప్రజలతో సంబంధాలను మెరుగు పరచుకునేందుకు అక్టోబర్ లో దేశ వ్యాప్త యాత్రను కాంగ్రెస్ చేపడుతుందని వెల్లడించారు. బీజేపీ పాలనలో అభిప్రాయాలు చెప్పడం కూడా నేరంగా మారిందన్నారు. పెగాసస్ అనేది సాఫ్ట్ వేర్ కాదని, ఇది దేశంలో రాజకీయ వర్గాల గొంతును నొక్కే సాధనం అని వివరించారు.
బీజేపీలో దళిత సామాజిక వర్గానికి స్థానం లేకుండా పోయిందన్నారు. దేశంలో దళితులు, గిరిజనులు అణచివేతకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ప్రాంతీయ పార్టీలు దళితులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. అన్ని వ్యవస్థలను బీజేపీ ఓ పద్దతి ప్రకారం నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. తాను ఎవరికీ భయపడబోనని స్పష్టం చేశారు. నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన సూచించారు.