కరోనా కట్టడికి అవసరమైన నిధుల కోసం కేంద్రం పీఎం కేర్స్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన లెక్కలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొంత కాలంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా పీఎం కేర్స్ ఫండ్ లెక్కలన్నీ బయటకు రావడంతో మోడీ సర్కార్ పై మరోసారి ప్రధాని అబద్దాలు చెబుతున్నారని ట్వీట్ చేశారు.
2020 మార్చి 27న పీఎం కేర్స్ ఫండ్ ను ఏర్పాటు చేశారు ప్రధాని మోడీ. అప్పటి నుంచి 2021 మార్చి 31 వరకు వచ్చిన విరాళాలను.. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఒక దరఖాస్తుతో కేంద్రం బయటపెట్టింది. మొత్తం రూ.10,990 కోట్ల నిధులు అందినట్టు తెలిపింది. ఇందులో నుండి రూ.3,976 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది.
పీఎం కేర్స్ ఫండ్ కు స్వచ్చంద విరాళాల రూపంలో రూ.7,183 కోట్లు రాగా విదేశాల నుంచి రూ.494 కోట్లు వచ్చాయని తెలిపింది కేంద్రం. ఈ నిధి నుంచి రూ.3,976 కోట్లను సహాయ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు స్పష్టం చేసింది. రూ.1,311 కోట్లను భారత్ లో తయారైన వెంటిలేటర్ల కొనుగోలుకు వెచ్చించినట్టు తెలిపింది.
కేంద్రం లెక్కలకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ. మోడీ అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. సెకండ్ వేవ్ లో పీఎం కేర్స్ ఫండ్ నుంచి వివిధ ఆస్పత్రులకు సరఫరా చేసిన వెంటిలేటర్లు నాసిరకంగా ఉన్నాయని గతంలో విమర్శించారు రాహుల్. నిధులను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.