కర్ణాటకలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర నేటితో 31 రోజులకు చేరుకుంది. ఈ రోజు యాత్ర టుముకూరు జిల్లాలోని తిప్టూర్ వద్ద ప్రారంభమైంది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాదయాత్ర సందర్భంగా దారిపొడవునా ప్రజలను రాహుల్ గాంధీ పలుకరించారు. అందరి క్షేమ సమాచారాలను అడిగుతూ ముందుకు సాగారు. దేశ ప్రజల సౌభాగ్యం కోసం, ప్రజలను ఏకం చేసేందుకు ఈ యాత్ర చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ గత నెల 8న కన్యాకుమారి నుంచి ప్రారంభించారు. ప్రతి రోజు 25 కిలో మీటర్ల మేర ఆయన పాదయాత్ర చేస్తున్నారు. మొత్తం ఐదు నెలల పాటు 12 రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగితే పాదయాత్ర చేస్తున్న ప్రాంతం నుంచే ఆయన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పార్టీ సీనియర్ నేతలు శశిథరూర్, మల్లికార్జున ఖర్గేలు పోటీ పడుతుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్తితి కనిపిస్తోంది.