కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు కర్ణాటకలో నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనికి ప్రవేశించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలోని డీ హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలోని మారెమ్మ దేవాలయం వద్ద నుంచి యాత్ర ప్రారంభమైంది.
డీహిరేహాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమై ఓబుళాపురం గ్రామం మీదుగా రాత్రి 7 గంటలకు బళ్లారి జిల్లాలో కర్ణాటకలోకి రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర ఎంటర్ కానుంది.
ఈరోజు 12 కి.మీ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగనుంది. ఈ నెల 18వ తేదీ నుండి రాహుల్ గాంధీ యాత్ర మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగనుంది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓబులాపురం నుండి రాహుల్ పాదయాత్ర ఏపీలోకి ప్రవేశించి, మళ్లీ ఇదే రోజు సాయంత్రానికి కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది.
ఏపీపీసీసీ చీఫ్ శైలజానాథ్, కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, తులసీరెడ్డి వంటి నేతలు రాహుల్ యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రాజకీయాలకు మూడేళ్లుగా రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన స్వగ్రామం నీలకంఠాపురంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆయన ఉన్నారు.
భారత్ జోడో యాత్ర అతి త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ నెల 23 వ తేదీన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అడుగు పెట్టనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర తొలుత ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్ చేరుకొని దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాద యాత్రకు రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది.