ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలని, ఈ ప్రయత్నంలో బలవంతపు పోకడలతో ఫలితం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. డెమాక్రసీకి అనువైన వాతావరణం ఉండాలని, ఇందుకు కొత్త ఆలోచనలు పుట్టుకు రావాలని ఆయన చెప్పారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ‘లర్నింగ్ టు లిజన్ ఇన్ ది 21 స్ట్ సెంచరీ’ అన్న అంశంపై మాట్లాడుతూ ఆయన .. రెండో ప్రపంచ యుద్ధం తరువాత..ముఖ్యంగా 1991 లో సోవియట్ యూనియన్ పతనం అనంతరం అమెరికా, చైనా దేశాలు వేర్వేరు దృక్పథాలతో ముందుకు సాగాయని అన్నారు.
2001 సెప్టెంబరు 11 నాటి టెర్రరిస్టు దాడుల తరువాత అమెరికా .. ఉద్యోగాల కల్పనలో వెనుకబడిపోయిందన్నారు. 21 వ శతాబ్దంలో గ్లోబల్ గా సరికొత్త దృక్పథాలే ప్రాధాన్యం వహిస్తున్నాయని, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అన్నది ముఖ్యమైన భాగంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
అనేక దేశాల్లో ఉత్పాదక రంగం స్థాయి తగ్గుతూ వస్తోందని, ఇది చైనాకు షిఫ్ట్ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా పెద్దఎత్తున అసమానతలు పెరిగిపోతున్నాయని, దీనిపై అత్యవసరంగా దృష్టి పెట్టవలసి ఉందన్నారు.
ఇండియాలో 12 రాష్ట్రాల ద్వారా నాలుగు వేల కిలోమీటర్ల దూరం వరకు సాగిన తన భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావించిన ఆయన.. తమ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేగలిగానన్నారు.