రాహుల్ గాంధీ పది జన్మలెత్తినా వీర్ సావర్కర్ కాలేరని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. సావర్కర్ ను అవమానించినందుకు ఆయనను దేశం క్షమించదన్నారు. ఆదివారం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడిన ఆయన.. ఈ దేశ స్వాతంత్య్రం కోసం సావర్కర్ తన యావజ్జీవితాన్ని ధారబోశారని, కానీ రాహుల్ గాంధీ బ్రిటీషర్ల సాయంతో భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలోనే గడుపుతున్నారని ఆరోపించారు.
సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల మహారాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయనకు దమ్ముంటే అండమాన్ జైలుకు వెళ్లి ఒకరోజు ఉండాలని సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సావర్కర్ గౌరవ్ యాత్రలను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. సావర్కర్ ని అవమానిస్తే ఈ దేశాన్ని అవమానించినట్టేనని షిండే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో చేతులు కలుపుతున్న మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేని కూడా విమర్శించారు.
థాక్రే తన చర్యలద్వారా శివసేన ఐడియాలజీని నీరు గారిస్తున్నారన్నారు. సావర్కర్ ని అవమానిస్తే తాము సహించబోమని లోగడ చెప్పినవారు ఇప్పుడు రాహుల్ గాంధీకి మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరిస్తున్నారని షిండే అన్నారు. వీర్ సావర్కర్ ని ఈ రాష్ట్ర ప్రజలు దేవుడితో సమానంగా పరిగణిస్తారని ఆయన చెప్పారు.