గౌతమ్ అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్ సభలో ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటాన బెట్టారు. తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా తనకు దేశమంతా అదానీ పేరే వినిపించిందని సెటైర్ వేశారు. తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు ఈ పేరే విన్నానని, అదానీ ఏ వ్యాపారంలో అడుగు పెట్టినా విఫలం కారని ప్రజలు వ్యాఖ్యానించారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అదానీ అంశంపై చర్చ జరగకుండా ప్రధాని మోడీ అడ్డుకుంటున్నారని, ఈ వ్యాపారవేత్తతో ఆయనకున్న ‘సంబంధం’ ఏమిటని ప్రశ్నించారు.
వివిధ వ్యాపారాల్లో అదానీ గ్రూప్ ఎంట్రీకి అనుగుణంగా నిబంధనలను మారుస్తూ వస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ బిలియనీర్ ప్రయోజనాలకోసం భారత విదేశాంగ విధానాన్ని కూడా మారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పటినుంచే ఆయనకు, ఆదానీకి మధ్య స్నేహం పెరుగుతూ వచ్చిందన్నారు. ఎయిర్ పోర్టుల అభివృద్ధి విషయంలో దీనికి సంబంధించిన అనుభవం ఉన్నవారే ఈ రంగంలో ప్రవేశించాలన్న నిబంధన ఉందని, కానీ అదానీ కోసం ప్రభుత్వం దీన్ని మార్చివేసిందన్నారు. ఆదానీకి ఆరు విమానాశ్రయాలను ఇచ్చారన్నారు. జీవీకే నుంచి ముంబై ఎయిర్ పోర్టును హైజాక్ చేశారని, ఇందుకు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం వినియోగించుకుందని రాహుల్ ఆరోపించారు.
2014 లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనికుల జాబితాలో అదానీ 609 వ స్థానంలో ఉన్నారని, అయితే 2022 లో ఆయన రెండో స్థానానికి ఎగబాకాడని రాహుల్ పేర్కొన్నారు.’ అదానీకి అనుకూలంగా ఏదైనా మిరాకిల్ జరిగిందా ? నేనైతే ఆశ్చర్యపోతున్నా.. 2014 లో 8 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు 2022 నాటికి 140 బిలియన్ డాలర్లకు ఎలా చేరుకున్నాయి’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
జమ్మూ కశ్మీర్ లోని యాపిల్స్ నుంచి పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్ల నిర్వహణ.. ఇలా సుమారు 10 రంగాల్లో అదానీ ఎలా వ్యాపారం చేస్తున్నారు అని కూడా ఆయన ప్రశ్నించారు. మోడీ విజిట్ చేసిన అన్ని దేశాల్లో ఆదానీకి కాంట్రాక్టులు లభించాయన్నారు. అగ్నివీర్ పథకం ఆర్మీ ఆలోచన కాదని, అది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నుంచి వచ్చిన ఆలోచన అని పేర్కొన్న ఆయన.. ఈ పథకాన్ని బలవంతంగా సైన్యంపై రుద్దినట్టు ఉందన్నారు. రాహుల్ మాట్లాడుతుండగా బీజేపీ ఎంపీలు అడుగడుగునా ఆయనకు అడ్డుపడుతూ నినాదాలు చేశారు.