కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చైనాను చూసి చొంగ కార్చుకుంటూ భారత్ పట్ల తృణీకరణ భావం గల వ్యక్తిని చూడటానికి తనకు చాలా ఇబ్బందిగా వుందన్నారు. పాండాలను కౌగిలించుకునేవారు చైనా గద్దలుగా మారలేరని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాహుల్ ఇటీవల లండన్‌లో పర్యటించారు. ఈ సందర్బంగాఆయన మాట్లాడుతూ… చైనా నుంచి మన దేశానికి ఎదురయ్యే ముప్పు గురించి ఇంకా జైశంకర్‌కు అర్థం కాదని విమర్శించారు. దీనిపై ఇండియా టుడే సమావేశంలో తీవ్రస్థాయిలో తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
పాండా హగ్గర్స్‌కు చైనా విధానాలను సమర్థించే రాజకీయ నాయకుడు అని మరో అర్థం కూడా వుందని ఆయన అన్నారు. చైనా గురించి రాహుల్ ప్రశంసాపూర్వకంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆ దేశం సామరస్యంగా ఉందని రాహుల్ చెబుతున్నారని పేర్కొన్నారు.
చైనా చాలా గొప్ప తయారీదారు అంటూ కితాబు ఇస్తున్నారన్నారు. అదే సమయంలో ‘మేక్ ఇన్ ఇండియా’ వల్ల ఏమీ ఉపయోగం ఉండదంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దేశం గురించి ఆయనకు ఓ అభిప్రాయం ఉండవచ్చన్నారు. కానీ ఆయన మన దేశ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. పాండా హగ్గర్స్ చైనా హాక్స్‌గా మారడానికి ప్రయత్నించడం ఆమోదయోగ్యంగా ఉండదన్నారు.
మరోవైపు చైనా సరిహద్దుల్లో పరిస్థితిని కేంద్రం నిజాయితీగా వెల్లడించడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన స్పందించారు. చైనా మన భూభాగంలోకి రావడం సాధ్యం కాకుండా చేసేందుకు సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడం మానేద్దామని చెప్పినవారు వారేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైనాతో మన సంబంధాల్లో ఇది చాలా సవాలుతో కూడుకున్న దశ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి చాలా సున్నితంగా ఉందని తెలిపారు. దళాల మోహరింపు జరగవలసిన ప్రదేశాలు ఇంకా ఉన్నాయేమో పరిశీలించాలని వివరించారు.