భారత దేశ సమైక్యతకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెను ముప్పుగా మారారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఇండియాను చీల్చాలని ఆయన ప్రజలను రెచ్చ గొడుతున్నారని, రాహుల్ ‘పప్పు’ అన్న విషయం భారతీయులకు తెలిసినా.. అది విదేశీయులకు తెలియదని రిజిజు అన్నారు. రాహుల్ మూర్ఖత్వపు స్టేట్మెంట్లపై స్పందించవలసిన అవసరం లేదని, కానీ ఇండియాకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను భారత ప్రతిష్టను దిగజార్చేందుకు దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నదే సమస్య అని ఆయన చెప్పారు.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగంలో రాహుల్ .. మోడీ నాయకత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలను మోడీ నాశనం చేస్తున్నారని ఆరోపించారు.అయితే ఇలాంటి కామెంట్లు మన దేశ సమైక్యతను దెబ్బ తీస్తాయని, ఇండియాలో అత్యంత ప్రజాదరణ గల నేత మోడీ అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
కోట్లాది ప్రజలు మోడీని అభిమానిస్తారని ఆయన చెప్పారు. ‘ఏక్ భారత్..శ్రేష్ట్ భారత్ ‘అన్నదే మోడీ మంత్రమన్నారు. తనను కాంగ్రెస్ ప్రిన్స్ గా ప్రకటించుకున్న రాహుల్..అన్ని పరిమితులనూ అతిక్రమించారని, విదేశీ గడ్డపై ఇండియాను అవమానపరుస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇండియాలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితమని, ఈ దేశ ప్రజలకు అన్నీ తెలుసునని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు.