బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను చంపేందుకు బీజేపీ సర్కార్ మూడు నల్ల చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. చిన్న వ్యాపారులను చంపేందుకు జీఎస్టీ, నోట్ల రద్దు తీసుకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అలాంటి పరిస్థితులు ప్రజలకు వుండవన్నారు.
తమ ప్రభుత్వం వస్తే రైతులకు రక్షణ ఉంటుందని వెల్లడించారు. కోటీశ్వరులకు రుణాలు మాఫీ చేసినప్పుడు రైతులకు కూడా మాఫీ చేసి ఉంటే వారకి ఎంతో మేలు జరిగి ఉండేది కదా అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పొదుపు సంస్థ అని, బీజేపీ అంటే పూజా సంస్థ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ దేశం పూజారులది కాదని, సన్యాసులదన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు తాము చెప్పినట్లుగా పూజలు చేయాలని కోరుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. పూజలు రెండు రకాలు ఉంటాయన్నారు. సాధారణంగా అందరూ దేవుడి వద్దకు వెళ్లి పూజలు చేస్తారన్నారు. ఇక రెండోది మోదీ రకమన్నారు.
తమను బలవంతంగా అందరూ పూజించాలనేది మోడీ రకం పూజ అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ తమను ఆరాధించాలని, తాము చెప్పినట్లుగానే ప్రజలంతా పూజలు చేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అనుకుంటున్నాయన్నారు. అలా ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు.
మన దేశంలో వ్యాప్తి చెందుతున్న భయాందోళనలు, మతం, కులం పేరుతో విభజన విధానానికి వ్యతిరేకంగా తాను యాత్ర చేస్తున్నానన్నారు. ఈ ప్రయాణం ఒక తపస్సులాంటిదని అభివర్ణించారు. ఈ యాత్ర వల్ల లాభమో, నష్టమో తాను చెప్పలేనన్నారు. భయానికి వ్యతిరేకంగా నిలబడటం, దేశాన్ని ఏకం చేయడమనే గొప్ప లక్ష్యాలతో తన యాత్ర కొనసాగుతోందన్నారు.