అగ్నిపథ్ ను టార్గెట్ చేసుకుని ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. పదే పదే ఉద్యోగాలపై తప్పుడు ప్రకటనలతో యువతను నిరుద్యోగం అనే అగ్నిపథంలో నడిచేలా ప్రధాని మోడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గతంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ప్రకటించిందన్నారు. ఆ లెక్కన ఇప్పటికి సుమారు 16 కోట్ల ఉద్యోగాలను ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ ఈ ఎనిమిదేండ్లలో యువతకు పకోడీలు వేయడంపైనే అవగాహన వచ్చిందన్నారు.
దేశ ప్రస్తుత పరిస్థితికి ప్రధాని మోడీనే బాధ్యుడని ఆయన అన్నారు. ఆదివారం తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన కోరారు.
గత ఎనిమిదేండ్లుగా జై జవాన్- జై కిసాన్ లను బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందంటూ రాహుల్ శనివారం మండిపడ్డారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని తాను గతంలోనూ చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు.