పెగసస్ స్పైవేర్ కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కనిపిస్తోంది. ఈ స్పైవేర్ ని కేంద్రం 2017లో కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనంతో ప్రతిపక్షాలు మరోసారి స్వరం పెంచాయి. మోడీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నాయకులు, సైనిక దళాలు, న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు, ఫోన్ ట్యాపింగ్ తో టార్గెట్ చేసిందని ట్వీట్ చేశారు.
ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రతిపక్ష నాయకులు, సైనిక దళాలు, న్యాయ వ్యవస్థలోని, మీడియాలోని ప్రముఖులపై నిఘా పెట్టేందుకు ఈ స్పైవేర్ ని వాడుకున్నారని ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తూ.. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ఈ ట్వీట్ కు జత చేశారు.
గతేడాది దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన పెగసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పెగసస్ స్పైవేర్ ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఒప్పందం 2017లోనే ఇజ్రాయెల్ ప్రభుత్వంతో జరుపుకుందని వివరించింది. ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగసస్ డీల్ కూడా కుదిరింది అనేది ఈ కథనం సారాంశం.
దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మోదీ ప్రభుత్వమే దేశద్రోహిలా మారిందని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ట్విట్టర్ లో విమర్శించారు. సుప్రీంకోర్టును, పార్లమెంటును కూడా ఈ అంశంలో కేంద్రం తప్పుదోవ పట్టించిందని రాజ్యసభ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ తెలిపారు. ఇలాంటి స్పైవేర్ ను వినియోగించి శత్రుదేశాలపై నిఘా పెట్టాల్సింది పోయి.. ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టడమేంటని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.