– బీజేపీ, టీఆర్ఎస్ దొందూదొందే
– వాటికి గుణపాఠం చెప్పాలి
– రాష్ట్రం ఏర్పడింది ఎందుకు?
– ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?
– కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వండి
– ప్రజల ప్రభుత్వం ఏంటో చూపిస్తాం
– రైతు సంఘర్షణ సభలో రాహుల్
అడుగడుగునా అడ్డంకులు.. సభా ప్రాంగణానికి, పార్కింగ్ ప్రాంతానికి దూరం ఎక్కువే.. కానీ.. కాంగ్రెస్ శ్రేణుల సంకల్పం ముందు అది చిన్నదైపోయింది. తమ ప్రియతమ నాయకుడి సభలో పాల్గొనాలన్న లక్ష్యం ముందు అడ్డంకులు, ఆంక్షలు నిలబడలేకపోయాయి. ప్రతీ అడుగూ వరంగల్ వైపే అనేలా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కదిలారు. రాహుల్ గాంధీ ఎందుకొస్తున్నారని ప్రశ్నించిన అధికార టీఆర్ఎస్ కు, బీజేపీకి సభను సక్సెస్ చేసి స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు.
భారీగా తరలివచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. టీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ రెండుపార్టీలు కలిసే పని చేస్తున్నాయన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని.. మోడీ ప్రభుత్వానికి మొదట్నుంచి టీఆర్ఎస్ సహకరిస్తోందని విమర్శించారు. మోడీ 3 నల్ల చట్టాలను తీసుకొస్తే టీఆర్ఎస్ సహకరించిందని మండిపడ్డారు. తెలంగాణలో సొంతంగా గెలవలేమని బీజేపీకి బాగా తెలుసన్న రాహుల్.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండాలని భావిస్తోందని అన్నారు. గులాబీ పార్టీ రిమోట్ కమలం పార్టీ చేతిలో ఉందని సెటైర్లు వేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ కు గుణపాఠం చెబుతామన్న రాహుల్.. ఆ రెండుపార్టీలపై కాంగ్రెస్ నేరుగా పోరాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ యువతను మోసం చేసిన వారిని గద్దె దించుతామన్నారు. ప్రజల అభిమానం ఉన్నవారికే ఈసారి టికెట్లు ఇస్తామని.. ఎవరేం చేస్తున్నారో పార్టీ గమనిస్తూనే ఉంటుందని తెలిపారు. ప్రజల మధ్య ఉండని వారికి ఈసారి టికెట్లు దక్కవని.. కాంగ్రెస్ విధివిధానాలను విమర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తానని.. టీఆర్ఎస్ పై తన పోరాటం కొనసాగుతుందన్నారు రాహుల్.
ప్రజలు టీఆర్ఎస్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. అయినా కూడా వారి కోరిక నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ తప్పక నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు రాహుల్. తెలంగాణలో ఒక వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల సొమ్ము వేల కోట్లు మింగింది ఎవరో అందరికీ తెలుసని.. అలాంటి వారితో కాంగ్రెస్ కు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. పొత్తుల గురించి కాంగ్రెస్ లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు. అలాగే.. టీఆర్ఎస్, బీజేపీతో సన్నిహితంగా ఉండే కోవర్టులు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని చెప్పారు.
రైతుల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోవట్లేదని.. దేశంలో, రాష్ట్రంలో పంటలకు మద్దతు ధర దొరకడం లేదని ఆరోపించారు. చారిత్రాత్మకమైన వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నానన్న రాహుల్… కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏ ఆశయంతో తెలంగాణ ఇచ్చామో అది సాధిస్తామని… ఎకరానికి రూ.15 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. తెలంగాణ సులువుగా ఏర్పడిన రాష్ట్రం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదని.. ఆనాడు ఆత్మ బలిదానాలకు చలించిపోయి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఇస్తే రైతులు, ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించామన్నారు. కానీ.. అలా జరగలేదని తెలిపారు రాహుల్ గాంధీ.