భారత్ జోడో యాత్రకు ఈ రోజు వరుణుడు అడ్డుతగిలాడు. జమ్ములో భారీ వర్షాల నేపథ్యంలో పాదయాత్ర ఈ రోజు ముందుకు సాగలేదు. భారీ వర్షాలు కురియడంతో ఈ రోజు యాత్రను రద్దు చేశారు. జమ్ములోని రాంబన్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.
ఈ క్రమంలో వర్షంలోనే కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగించారు. అయితే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు మూసుకుపోయాయి. దీంతో భారత్ జోడో యాత్రను ఈ రోజు రద్దు చేస్తున్నట్టు పార్టీ ప్రకటిచింది.
ఈ మేరకు విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రిపబ్లిక్ డే సందర్భంగా రేపు యాత్రకు విరామం ఉంటుందని వెల్లడించారు. తిరిగి యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం, ఈ రోజు యాత్ర ఖోబాగ్ ప్రాంతంలో నిలిచిపోవాలి. అయితే, ఒక రోజు యాత్ర రద్దైనప్పటికీ షెడ్యూల్ ప్రకారం యాత్ర ఈ నెల 30న ముగియనుంది. గత ఏడాది సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాల్లో 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనున్నది.