కొంచెం ‘అతి’ గా అనిపించవచ్చు.. కానీ జరిగింది మాత్రం నిజం అంటున్నారు .. .. తన భారత్ జోడో పాదయాత్రలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మంగళవారం యూపీలో తన సోదరి ప్రియాంక గాంధీ పట్ల అనుసరించిన పధ్దతి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది, వేదికపైనే ఆమెకు ఆయన హగ్గులు, కిస్సులు ఇచ్చి తన సోదర ప్రేమను చాటుకున్నారు. మొదట రాహుల్ ప్రవర్తనకు ఆశ్చర్యపోయినా .. కాసేపటికే తేరుకుని ప్రియాంక నవ్వేశారు. ఆమెతో బాటు రాహుల్ కూడా చిరునవ్వులు నవ్వారు.
ఈ అన్నా చెల్లెళ్ళ బంధం తాలూకు వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. మొదట తన సోదరి చెవిలో ఏదో మాట్లాడిన రాహుల్.. ఆమెను దగ్గరకు హగ్ చేసుకుని చెంపలపై ముద్దు పెట్టారు. వయస్సులో తనకన్నా రెండేళ్లు చిన్నదైన ప్రియాంక గాంధీ అంటే ఆయనకు ఎంతో అభిమానం.. ప్రేమ..
లోగడ ‘రక్షాబంధన్’ రోజున కూడా తన చేతికి ఆమె రాఖీ కట్టినప్పుడు ఆయన.. తమ ఇద్దరి జీవితాల్లో ఎన్నో ఎగుడుదిగుడులు ఉన్నాయని, తన బలం, తన సాహసం అంతా ప్రియాంకే నని ట్వీట్ చేశారు. ఒకరికొకరం ఎంతో ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్న ఆయన ఇందుకు సంబంధించిన మాంటెజీని తన సోదరికి అంకితమిస్తున్నానని నాడు తెలిపారు.
తాజా ‘ఘటన’కు సంబంధించిన వీడియోను ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేయగానే అనేకమంది ఈ అన్నాచెల్లెళ్ల బంధాన్ని పొగుడుతూ ట్వీట్లతో వెల్లువెత్తారు. ఈ గాంధీ కుటుంబం ‘హ్యాపీ ఫ్యామిలీ’ అని పలువురు ప్రశంసించారు.