భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతోంది. కథువా జిల్లాలోని హత్లీ మోరాలో ఈ రోజు ఉదయం యాత్ర ప్రారంభమైంది. పార్టీకి చెందిన పలువురు నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్ గాంధీ టీ షర్ట్ ధరిస్తూ వస్తున్నారు.
కానీ దానికి భిన్నంగా ఈ రోజు ఆయన మొదటి సారి జాకెట్ ధరించి యాత్రలో పాల్గొన్నారు. దేశంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఉత్తర భారత్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది.
గత కొన్ని రోజులుగా ఎముకలు కొరికే చలిలోనూ కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ టీషర్ట్ ధరించే యాత్రలో పాల్గొంటున్నారు. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని రాహుల్‌ను మీడియా ప్రశ్నించింది. తాను టీషర్ట్ వేసుకోవడం గురించి అందరూ ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు..? అని ఆయన ప్రశ్నించారు.
చలి గురించి తనకు భయం లేదన్నారు. అందుకే తాను స్వెట్టర్ వేసుకోవడం లేదని బదులిచ్చారు. ఒకవేళ తనకు భరించలేనంత చలి వేస్తే అప్పుడు ఖచ్చితంగా స్వెట్టర్ వేసుకోవడంపై ఆలోచన చేస్తానని పేర్కొన్నారు. రాహుల్ టీ షర్ట్‌పై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. టీ షర్ట్ లోపల థర్మల్స్ ధరిస్తున్నారని రాహుల్‌పై వారు ఆరోపణలు చేశారు.