“రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే.” ఇప్పుడు ఈ ట్వీట్ దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. అసలే రాహుల్ గాంధీ పై వేటు పడడంతో భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు ఈ ట్వీట్ పై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ ట్వీట్ ఎవరు చేశారంటే.. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ డైరెక్టర్ వివేక రంజన్ అగ్నిహోత్రి చేశారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటే అగ్నిహోత్రి కరెంట్ అఫైర్స్ తో పాటు కీలక అంశాలపై తన దైన స్టైల్ లో స్పందిస్తుంటారు. ఆయన తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ కొన్ని రోజుల క్రితం దేశ ప్రధాని మోదీని కించపర్చుతూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీశాయి. దీంతో రాహుల్ గాంధీ పై గుజరాత్ బీజేపీ నేత పరువు నష్టం దావా వేయడం జరిగింది.
దీనిపై కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకొని రాహుల్ గాంధీ పై పార్లమెంట్ అనర్హత వేటు వేసింది. ఈ క్రమంలో డైరెక్టర్ అగ్నిహోత్రి ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. “రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..” అని ట్వీట్ పెట్టిన తరువాత కొన్ని గంటలకు ఆయన మరో ట్వీట్ చేశారు. “గతంలో ఇందిరాగాంధీ పై అనర్హత వేటు పడిన సమయంలో కూడా కాంగ్రెస్ వాదులు దుమ్మెత్తి పోశారు. కానీ ఆమె నిజమైన నాయకురాలు కాబట్టి ఆమె తిరిగి పుంజుకుంది. అయితే సరైన నాయకుడు ఎవరూ లేకపోవడంతో ఇక పై కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి.” అని రాసుకొచ్చారు ఆయన. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక “ది కాశ్మీర్ ఫైల్స్” తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ డైరెక్టర్ వివేక రంజన్ అగ్నిహోత్రి.. 1990 లలో కశ్మీర్ పండిట్లపై జరిగిన దౌర్జన్యాలను ఆ సినిమాలో చూపించడం జరిగింది. ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక అప్పటి నుంచి ఆయన నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన త్వరలోనే “ది వ్యాక్సిన్ వార్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.