కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షానికి రాహుల్ గాంధీ ముఖచిత్రం అయితే, ప్రధాని నరేంద్ర మోడీని ఎవరూ టార్గెట్ చేయలేరని ఆమె పేర్కొన్నారు.
ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ ‘అతిపెద్ద టీఆర్పీ’అని ఆమె ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశంలో మమత మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని నాయకుడిగా కొనసాగించాలని బీజేపీ కోరుకుంటోందని ఆమె అన్నారు.
బీజేపీ ముందు తలవంచేది కాంగ్రెస్సేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలు తమ పార్టీకి వ్యతిరేకంగా మైనారిటీలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్లో అదానీ, ఎల్ఐసీ ఇష్యూపై చర్చలు జరపాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
అదానీ సమస్యపై ఎందుకు చర్చలు జరగడం లేదు? అని ఆమె ప్రశ్నించారు. ఎల్ఐసీ పై చర్చలు ఎందుకు జరగడం లేదు? గ్యాస్ ధరపై చర్చ ఎందుకు జరగలేదు?అని మండిపడ్డారు. వీటన్నింటి మధ్య యూనిఫాం సివిల్ కోడ్ కాపీని ప్రవేశపెట్టారని చెప్పారు. తాము ఉమ్మడి పౌర స్మృతి బిల్లును అనుమతించబోమన్నారు.