పార్లమెంట్ లో వరుసగా రెండో రోజు తీవ్ర గందరగోళం నెలకొంది. సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రతిపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై సభను ప్రతిపక్షాలు స్తంభింప చేశాయి.
పార్లమెంట్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం ఎదటు ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ధరల పెంపుతో సామాన్యుడిపై పెను భారం పడుతోందన్నారు. ఇలా ధరలు పెంచుకుంటే సామాన్యుడు ఎలా బతకాలంటూ మండిపడ్డారు.
ఇప్పటికైన ప్రభుత్వం గ్యాస్, ఇతర నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశాయి. లోక్ సభలో అగ్నిపథ్ పై కాంగ్రెస్, ఆర్ఎస్పీలు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు.
నిత్యావసరాలపై జీఎస్టీ పెంపుపై వెంటనే చర్చకు అనుమతివ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు.
కేరళలో నీట్ పరీక్షల సమయంలో ఘటనపై చర్చకు ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమచంద్రన్ వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు పెద్దల సభలో ఎంపీ మనోజ్ ఝా, సీపీఎం ఎంపీ కరీం జీరో అవర్ నోటీసులిచ్చారు.
జీఎస్టీ పెంపు ఎంపీ కరీం, అగ్నిపథ్ స్కీంపై మనోజ్ ఝాలు జీరో అవర్ చర్చకు నోటీసులిచ్చారు. సభలో గందరగోళం నేపథ్యంలో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.