కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజ్యాంగ పీఠికను బిగ్గరగా చదివి వినిపించారు. సోమవారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజ్యాంగ పీఠికలో ఏముందో తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పీఠినకు చదివి వినిపించారు.
రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన ప్రాధమిక హక్కులను రక్షించాలంటూ కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు సోమవారం సత్యాగ్రహ దీక్షలు చేపట్టాయి.
బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని…ముఖ్యంగా యువత పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పౌరసత్వానికి మొదటిసారిగా మత పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 2015 కంటే ముందు పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి భారతదేశానికి వచ్చిన ముస్లింలకు ఈ చట్టం మేలు చేకూర్చుతుందని బీజేపీ ప్రభుత్వం చెబుతుండగా..ముస్లింల పట్ల ఈ చట్టం వివక్ష చూపుతుందని విమర్శకులంటున్నారు.