రాహుల్ గాంధీని ఉస్మానియాకు తీసుకొచ్చే విషయంలో విద్యార్థి సంఘాల నాయకులు వెనక్కి తగ్గడం లేదు. ఆయన్ను ఎలాగైనా ఓయూకి తీసుకొస్తామని అంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు, అధికారులు కుట్ర చేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కచ్చితంగా ఓయూలో ముఖాముఖి జరిపి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియాలో నిరసన కార్యక్రమం కొనసాగింది. ఆర్ట్స్ కాలేజీ దగ్గర వైస్ చాన్సలర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
రాహుల్ పర్యటనను తాము స్వాగతిస్తున్నామని ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి నేతలు స్పష్టం చేశారు. యూనివర్సిటీ స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలని.. ప్రభుత్వం ఆడించినట్లు ఆడకూడదని మండిపడ్డారు విద్యార్థి నేతలు. వీసీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు ప్రగతి భవన్ దగ్గర కూడా టెన్షన్ నెలకొంది. ఓయూ విద్యార్థి నేతలు ప్రగతి భవన్ ను ముట్టడించారు. రాహుల్ గాంధీ ఓయూ టూర్ కు అనుమతి ఇవ్వాలని నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి పంజాగుట్ట పీఎస్ కు తరలించారు.