రాహుల్ గాంధీని ఉస్మానియాకు తీసుకు రావాలని అన్నివిధాలుగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. అయితే.. వారం రోజులు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతూ వచ్చిన ఓయూ పాలకమండలి.. తాజాగా పర్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించింది.
మే 5, 6 తేదీల్లో రాహుల్ తెలంగాణలోనే ఉంటారు. 5న వరంగల్ సభకు ప్లాన్ చేయగా.. 6న పార్టీ నేతలతో భేటీ.. ఓయూ టూర్ కు ప్రణాళికను సిద్ధం చేశారు. విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించాలని భావించారు. దీనికోసం ఓయూ వీసీని స్వయంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిసి అనుమతివ్వాలని కోరారు. కానీ.. చివరకు పర్మిషన్ ఇచ్చేందుకు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిరాకరించింది.
ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రభుత్వం కావాలనే రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.
ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. కానీ.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో కాసేపు వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలోనే ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.