కర్నాటకలోని ప్రభుత్వ కాలేజ్ హిజాబ్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేగింది. ప్రతిపక్షాలు దీనిపై అభ్యంతరం చెబుతున్నాయి. మత రహితంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ కాలేజ్ లలో ఇలాంటి ధోరణుల్ని ప్రోత్సహించడమేంటని దుమ్మెత్తి పోస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఉడిపిలోని కుందాపూర్ ప్రాంతంలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్ ధరించిన స్టూడెంట్స్ ను లోపలికి రానివ్వలేదు. సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చెలరేగింది. హిజాబ్ తమ జీవితంలో భాగమని.. ఇంతకుముందు సీనియర్లు ఇదే కాలేజ్ లో ఇలాగే చదువుకున్నారని స్టూడెంట్స్ తెలిపారు. అకస్మాత్తుగా ఈ కొత్త రూల్ ఎలా అమల్లోకి వచ్చిని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్ర నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతుండగా.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్టూడెంట్స్ కు మద్దతు తెలిపారు. ఆడపిల్లల భవిష్యత్తును దేశంలో దోచుకుంటున్నారని విమర్శించారు. సరస్వతీ దేవి ఎవరి పట్ల వివక్ష చూపించరని.. ఆమె అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తారని ట్విట్టర్ లో పేర్కొన్నారు రాహుల్.
ఈ అంశంపై కశ్మీర్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రులు మెహబాబూ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. కర్నాటక కాలేజ్ చర్యల్ని ఖండించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రాహుల్ ట్వీట్ ను రీట్వీట్ చేశారు.