రాహుల్ జూలు విదిల్చారు. ఇక పార్టీని కంప్లీట్ స్కానింగ్ చేసి.. తనకు అనుకూలంగా లేని వైరస్ లన్నింటిని కిల్ చేసే పనిలో పడ్డారు. దాదాపు మూడు, నాలుగేళ్ల నుంచి పడుతున్న స్ట్రగుల్ నుంచి ఇప్పటికి బయటపడి… అమ్మ సోనియాను ఒప్పించి.. పార్టీ వరకు తన వార్ వన్ సైడ్ అయ్యేలా చేసుకుంటున్నారు. సీనియర్లు ఏమంటా లేఖాస్త్రం వదిలారో గాని.. అది బూమరాంగ్ అయి.. వారికే గుచ్చుకుంది. ఏకంగా పార్టీ సీనియర్ మోస్ట్ నేత గులాం నబీ ఆజాద్ ని పక్కన పెట్టేశారు. అనుకూలంగా ఉన్నవారినే ఉంచి.. ఏ మాత్రం తేడా ఉన్నా సరే.. వారందరినీ పక్కన పెట్టేశారు. ఇక నుంచైనా రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే పార్టీ నడిచే అవకాశం కనపడుతోంది. ఇన్నాళ్లు.. సోనియా, రాహుల్ ఇద్దరూ రెండు అధిష్టాన కేంద్రాలుగా వ్యవహారం చేయడం.. పార్టీలోవారు కూడా ఇద్దరున్న పరిస్ధితిని అడ్వాంటేజ్ గా తీసుకుని.. పార్టీలో తమ మాట నెగ్గేలా చేసుకోవాలని ప్రయత్నం చేయడం.. దాని వలన.. పార్టీకి నష్టం జరగడం.. ఇవన్నీ అందరి కళ్ల ముందే జరిగాయి. నరేంద్ర మోదీ తిరుగులేని శక్తిగా ఎదిగినా… దేశ ప్రజలకు అంతిమంగా ఫలితాలు చూడటమే అలవాటు. వారి స్ధితిగతుల్లో మార్పులు రాకుండా.. కష్టాలు తీరకుండా.. కేవలం డిజిటల్ ప్రచారంతో పెద్ద నాయకుడు అయిపోయారు కాబట్టి ఇంకేమీ కాదని అనుకోవడం పొరపాటు. వ్యతిరేకత అంటూ వస్తే.. మూలనున్న ముసలోళ్లను కూడా ప్రజలు అధికార పీఠం ఎక్కిస్తారు.
రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు.. ఇన్ని సమస్యలున్నా కాంగ్రెస్ విజయం సాధించిందంటే కారణం.. అక్కడ లోకల్ గా బిజెపిపై వచ్చిన వ్యతిరేకతే ప్రధాన కారణం. దాన్ని అంది పుచ్చుకోగలిగిన చోట.. విజయం సాధించారు. అలా రేపు దేశంలో బిజెపి పట్ల వ్యతిరేకత వచ్చినప్పుడు.. అందుకోగలిగే పరిస్ధితి కాంగ్రెస్ లో ఉండాలంటే.. ఇప్పుడీ మార్పులు జరగక తప్పదని.. ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.రాహుల్ గాంధీ నాయకుడిగా ఫెయిలయ్యాడని.. ఆయన పని అయిపోయిందని.. ఇక ఆయన వల్ల కాదనే ప్రచారం బయట కన్నా పార్టీలోనే ఎక్కువగా జరిగింది. అందుకు కారణం.. రాహుల్ కి వ్యతిరేకంగా పని చేసిన సీనియర్లే ఆ ప్రచారం వెనక ఉన్నారు. ఇప్పుడు పార్టీని ఏకతాటి మీద నడపగలిగే శక్తి రాహుల్ కి వస్తే… పార్టీలో తిరుగులేని నాయకుడిగా రాహుల్ గాంధీ ఎదగగలిగితే.. ఒక రాజకీయ నాయకుడిగా.. మోదీకి ధీటుగా ఎదిగే ఛాన్సు ఉంటుంది.
ఇప్పుడు చేసే మార్పులను.. సరైన దిశలో చేసుకుంటే.. సరైన మనుషులను ఎన్నుకుని.. రాజకీయాన్ని నడపగలిగితే.. రాహుల్ గాంధీ తప్పకుండా మోదీకి ధీటైన నాయకుడిగా ఎదుగుతారు. మోదీ-అమిత్ షా ద్వయం నేడు అంతగా పాతుకుపోయారంటే.. వారి అధ్యయనం, వ్యూహాలే కారణం. వారి నిర్ణయాల కోసం నేడు దేశంలో మిగతా నేతలంతా ఎదురు చూసేలా వారు వాతావరణాన్ని మార్చుకోగలిగారు. అలాగే రాహుల్ గాంధీ సైతం.. సరైన అధ్యయన చేసి.. సరైన వ్యూహాలను అమల్లోకి పెడితే.. ఆయన నాయకత్వం మీద కిందివారికి నమ్మకం కలుగుతుంది.. అప్పుడు ఆటోమేటిక్ గా అభిమానం పెరుగుతుంది. అప్పుడు రాహుల్ నాయకత్వం బలపడుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.