లఖింపూర్ ఖేరీ ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా క్రిమినల్ అని ఆరోపించారు.
లఖింపూర్ ఘటన పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని సిట్ తేల్చడంతో.. ప్రతిపక్షాలు అజయ్ మిశ్రా రాజీనామాకు పట్టుబడుతున్నాయి. లోక్ సభలో మరోసారి ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. అజయ్ మిశ్రా నిందితుడని.. ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ ఘటనపై చర్చ జరగాలన్న ఆయన.. కుట్ర పన్ని రైతుల్ని చంపేశారని మండిపడ్డారు.
ఈ ఘటనపై కేసు కోర్టు పరిధిలో ఉందని.. దాని గురించి చర్చించలేమని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. అయితే విపక్ష సభ్యులు మాత్రం చర్చకు పట్టుబట్టి వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. లఖింపూర్ బాధితులకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
ఇటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని సభ్యులు డిమాండ్ చేశారు. వారి ఆందోళనల మధ్యే సభ వాయిదా పడింది.