బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్నాటకలోని బళ్లారిలో శనివారం జరిగిన మెగా ర్యాలీలో బీజేపీ, ఆరెస్సెస్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ, ఆరెస్సెస్‌ల సిద్ధాంతమని ఆయన ఆరోపించారు.
దేశాన్ని చీల్చేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారని, అందుకే దేశాన్ని కలిపి ఉంచే ఉద్దేశంతో, ప్రజలను ఐక్యం చేసేందుకు తన పాదయాత్రకు భారత్ జోడో యాత్రగా అని పేరు పెట్టినట్టు ఆయన పేర్కొన్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాహుల్ యాత్రతో కర్నాటకలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. భారత్ జోడో యాత్రను సెప్టెంబర్ 7 తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభించారు.
భారత్ జోడో యాత్ర 38వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఆయన సుమారు వేయి కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితిని మెరుగు పరిచే వ్యూహంతో ఈ యాత్రను చేపట్టారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3570 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది.