- కేసీఆర్ పై రాహుల్ ఫైర్
తెలంగాణలో పోడు భూముల కోసం ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు మొదలవ్వడంతో పలు జిల్లాల్లో సాగు కోసం ఉపక్రమించగా.. అధికారులు, పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులు జరుగుతున్నాయి. వీటిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైరయ్యారు.
తెలంగాణలోని గిరిజనులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు రాహుల్. ఆదివాసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. వారి గొంతును అణిచివేసేందుకు పోలీసుల బలగాలను ఉపయోగించడం రాష్ట్ర ఆకాంక్షలకు అవమానమని అభివర్ణించారు.
మంచిర్యాల జిల్లా కోయపోశగూడెంలో సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో గుడిసెలు వేసుకున్నారు గిరిజనులు. ఆ గుడిసెలను తొలగించేందుకు వచ్చిన ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు గిరిజన మహిళలు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆ సమయంలో గిరిజన మహిళలను ఈడ్చుకెళ్లారు ఫారెస్ట్ మహిళా సిబ్బంది. దానికి సంబంధించే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఇదే విషయంపై రాహుల్ గాంధీ ఫేస్ బుక్ లో స్పందించారు. పట్టాలను అర్హులైన ఆదివాసీలకు బదలాయిస్తామని ప్రభుత్వం హామీనిచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ సర్కార్ వెనక్కి తగ్గి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని విమర్శించారు. కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రం ఏర్పడిందన్న రాహుల్.. జల్ జంగల్ జమీన్ పోరాటంలో ఆదివాసీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.