దేశ ప్రజలతో పాటు దేశ ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని టీబీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ బీసీ వర్గాలను కించపర్చారని బీజేపీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారని.. గాంధీ ఫ్యామిలీ మాత్రమే దేశాన్ని పాలించాలని అనుకుంటోందని ఆయన విమర్శించారు.
రాహుల్ గాంధీ న్యాయవ్యవస్థను కూడా లెక్క చేయకుండా అవమాన పర్చుతున్నారని.. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్ 6 నుంచి 14 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇక రాహుల్ గాంధీ ఓబీసీ సమాజాన్ని కించపర్చే విధంగా మాట్లాడారని బండి సంజయ్ మండిపడ్డారు. దేశ ప్రతిష్టను కాంగ్రెస్ దెబ్బ తీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక దురదృష్టవశాత్తు ఎంపీనయ్యానని చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ నే కించపర్చారని మండిపడ్డారు. న్యాయవ్యవస్థలపై రాహుల్ గాంధీకి నమ్మకం లేదని..కోర్టు తీర్పులు వెలువరిస్తే మోడీకి ఏం సంబంధం అని బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్న బండి.. రాహుల్ కాంగ్రెస్ కు పట్టిన పీడ అని ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.
ఇక రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఎక్కడివి అని కేసీఆర్, కేటీఆర్ లను బండి విమర్శించారు. రైతుల కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా.. వాటిని ఖర్చు చేయకుండా దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే ఖర్చు పెడుతుందని బండి సంజయ్ అన్నారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కేంద్రాన్ని బద్నాం చేస్తుందని ఆయన విమర్శించారు.