మోడీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సూరత్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెడీ అవుతున్నారు. ఈ తీర్పుపై సూరత్ సెషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని సెషన్ కోర్టును ఆయన కోరనున్నారు. కేసులో తీర్పు వచ్చే వరకు శిక్షపై మధ్యంతర స్టే విధించాలని ఆయన అభ్యర్థించనున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించి పిటిషన్ తయారు చేసినట్టు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి.
మోడీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా ప్రకటించింది. ఈ కేసులో
ఆయనకు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల పాటు సమయం కూడా ఇచ్చింది.
ఈ క్రమంలో ప్రజాప్రానిధ్య చట్టం-1951 కింద రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు లోక్ సభ సచివాలయం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయనపై అనర్హత వేటు నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు, ఇతర విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నాయి.