2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తమ నేత రాహుల్ గాంధీ విపక్ష ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ప్రకటించారు. రాహుల్ చేబట్టిన భారత్ జోడో పాదయాత్ర గురించి ప్రస్తావిస్తూ ఆయన.. రాహుల్ అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదని, ఈ దేశ సామాన్యప్రజలకోసం చేస్తున్నారని అన్నారు. దేశ సమైక్యతే ఆయన లక్ష్యమన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించినంతవరకు రాహుల్ విపక్ష నేతగానే కాక.. ప్రధానమంత్రి అభ్యర్థి కూడా అని కమల్ నాథ్ ఓ వార్తా సంస్థకు ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేయలేదని, గాంధీ కుటుంబం తప్ప మరే కుటుంబమూ దేశం కోసం ఇన్ని త్యాగాలు చేయలేదని ఆయన అన్నారు. అధికారం కోసం రాహుల్ పాలిటిక్స్ పాదయాత్ర చేయడం లేదని, గద్దెపై ఎవరినైనా కూర్చోబెట్టగలిగే ఈ దేశ ప్రజల కోసం చేస్తున్నారని ఆయన చెప్పారు.
2024 ఎన్నికల్లో విపక్ష ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పోటీ చేయాలని కమల్ నాథ్ ఒక్కరే ప్రతిపాదన చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సంస్థకు ద్రోహం చేసినవారికి పార్టీలో స్థానం లేదని కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు ఆయన.. ఏ వ్యక్తి గురించీ తాను ప్రస్తావించబోనని, కానీ పార్టీకి ద్రోహం చేసి కార్యకర్తల విశ్వాసాన్ని భంగపరచిన వారికి పార్టీలో స్థానం లేదని చెప్పారు.
మధ్యప్రదేశ్ లో మళ్ళీ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన పక్షంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కమల్ నాథ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు జరుగుతాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.