కర్ణాటక ఎన్నికలు ముగిశాయి.. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఇక బోలెడంత తీరిక… దీంతో పార్టీ నేత రాహుల్ గాంధీ తాజాగా మళ్ళీ ప్రజా సమస్యల అధ్యయనంపై దృష్టి పెట్టారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు ట్రక్కులో ప్రయాణించారు. రాత్రివేళ ప్రయాణ సమయంలో భారీ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన స్వయంగా ట్రక్కు ప్రయాణానికి నడుం కట్టారు .
ఓ ట్రక్ డ్రైవర్ పక్కన ఆయన కూర్చున్న ఫోటోను, వీడియోలను కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేస్తూ.. ‘మీ రాహుల్ గాంధీ మీ మధ్య ఉన్నారు’ అని క్యాప్షన్ పెట్టింది. డ్రైవర్ల మన్ కీ బాత్ వినండి అని కూడా పేర్కొంది.
పైగా ‘జననాయకుడు వీరి సమస్యలను ఆలకించేందుకు ట్రక్కులో ఢిల్లీ నుంచి చండీగఢ్ కు బయల్దేరారు. భారతీయ రోడ్లపై సుమారు 90 లక్షలమంది ట్రక్ డ్రైవర్లున్నారు. వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి మన్ కీ బాత్ ‘ ఆలకించదలచుకొంటున్నారు’ అని కాస్త సుదీర్ఘంగానే పార్టీ వ్యాఖ్యానించింది.
ఈ నెలారాంభంలో కర్ణాటక ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా రాహుల్.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సులో ప్రయాణించి ముఖ్యంగా మహిళల సమస్యల గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత ఓ రెస్టారెంట్ లో సరదాగా మసాలా దోసె తింటూ డెలివరీ బాయ్ ల ఇబ్బందులపై వాకబు చేశారు. ఇలా ప్రజలతో అప్పుడూ ఇప్పుడూ ఆయన మమేకమవుతుంటారని కాంగ్రెస్ పార్టీ వివరించింది.
..