కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూపు రేఖలే మారిపోయాయి. ట్రిమ్ చేసిన గడ్డం, హెయిర్ కట్.. సరికొత్త కాంగ్రెస్ నేతలా, యంగ్ ప్రొఫెసర్ లా కనిపిస్తున్నారాయన. తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా పెంచిన గడ్డం, జుట్టు.. అన్నీ ట్రిమ్ చేసేసుకున్నారు. మెరిసే సూట్ లో హుందాగా కనిపిస్తున్నారు. .ఇలా తన సరికొత్త రూపు రేఖలను ఆయన మార్చుకోవడానికి కారణం ఉంది.
బ్రిటన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోఆయన లెక్చర్ ఇవ్వబోతున్నారు. ఇందుకు బుధవారం అప్పుడే ఈ దేశం చేరుకున్నారు. ‘లర్నింగ్ టు లిజెన్ ఇన్ ది 21 స్ట్ సెంచరీ’ అనే అంశంపై ఈ విశ్వవిద్యాలయంలో రాహుల్ ఉపన్యసించనున్నారు. ఇరవై ఒకటో శతాబ్దంలో మనముందున్న సవాళ్లు అన్నదే దీని ఉద్దేశం.
విజిటింగ్ ఫెలోగా ఆయనకు ఈ అవకాశం దక్కింది. తన లెక్చర్ సందర్భంగా ఆయన ఇండియాలో తాను చేబట్టిన సుదీర్ఘమైన భారత్ జోడో పాదయాత్ర గురించి వివరించనున్నారు. ఇంగ్లండ్ సహా యూకే లోని వివిధ నగరాల్లో రాహుల్ వారం రోజుల పాటు పర్యటిస్తారని, ఈ నెల 5 న లండన్ లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ నగరంలోని ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులను కూడా రాహుల్ కలుసుకుంటారు. అలాగే బ్రిటన్ లోని వ్యాపారవర్గాలతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవుతారని ఈ వర్గాలు వివరించాయి. రాహుల్ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.