కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ నేత శశిథరూర్ రోజురోజుకీ తన ఆరాటాన్ని అణుచుకోలేకపోతున్నారు. ఎలాగైనా తనదే గెలుపు కావచ్చునని కొండంత ఆశతో ఉన్నారు. రంగంలో ఉన్న మరో సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే .. పార్టీ సిస్టంలో మార్పులు తేలేరని.. , తానైతే మార్పులు తేగలుగుతానని ఆయన ఇదివరకే ప్రకటించారు. తాజాగా.. పోటీ నుంచి ఉపసంహరించుకోవలసిందిగా తనకు నచ్చజెప్పాలని కొందరు రాహుల్ గాంధీని కోరారట. కానీ ఆయన నిరాకరించారట.
కేరళ పీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్ తమ మద్దతు ఖర్గేకేనని ప్రకటించిన నేపథ్యంలో థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు పోటీ చేస్తేనే పార్టీకి ప్రయోజనకరమని రాహుల్ తనపట్ల విశ్వాసం వ్యక్తం చేశారని ఆయన చెప్పుకున్నారు. పార్టీలో బడా నేతలు చాలామంది తనకు మద్దతునివ్వడం లేదని, కానీ తనకు అనేకమంది డెలిగేట్ల బలం ఉందని తెలిపారు. బహుశా మధుసూదన్ మిస్త్రీ సర్క్యులర్ జారీ చేయకముందు సుధాకరన్ ఈ స్టేట్ మెంట్ చేసినట్టు తాను భావిస్తున్నానన్నారు.
కానీ ఎవరిమీదా నేను ఫిర్యాదు చేయడంలేదు అని చెప్పారు. అధికారిక అభ్యర్ధులంటూ ఎవరూ లేరని, తాము తటస్థంగా ఉంటామని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇదివరకే ప్రకటించారని థరూర్ పేర్కొన్నారు.
పోటీ చేస్తున్న అభ్యర్థులకు వ్యతిరేకంగా గానీ, మద్దతుగా గానీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్ఫీ లీడర్లు , పార్టీ అధికారిక ప్రతినిధులు ప్రచారం చేయరాదని నిన్న ఓ సర్క్యులర్ జారీ అయింది.