ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాడీవేడి రాజకీయ విమర్శల నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రంపై విమర్శలు చేస్తుంటే.. కేంద్రం మాత్రం నిబంధనలకు తగ్గట్లే అన్ని రాష్ట్రాల్లోనూ కొనుగోళ్లు జరుగుతాయని.. తెలంగాణ అందుకు ఏమాత్రం మినహాయింపు కాదని స్పష్టం చేసింది.
అదేవిషయమై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. రైతుల శ్రమతో రాజకీయాలు చేయడం సిగ్గు చేటని అన్నారు. రెండు ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలుపై నాటకాలు ఆడుతూ.. నైతికబాధ్యతను విస్మరిస్తున్నాయని రాసుకొచ్చారు.
వరి ధాన్యం కొనుగోలుపై.. రైతు పండించిన చివరిగింజ కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతోందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో రాహుల్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా.. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పందించారు. రాహుల్ చేసిన ట్వీట్ కు ట్యాగ్ చేస్తూ.. రీట్వీట్ చేశారు రేవంత్. తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని.. ఉద్యమ కార్యచరణకు మద్ధతుగా నిలిచిన రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.