అదానీ గ్రూప్ వెనుక ఉన్న శక్తులెవరో నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంలో కేంద్రం భయపడుతోందని ఆయన అన్నారు. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం వెనుకాడుతోందని ఆయన తెలిపారు. ఎలాంటి చర్చ జరగకుండా ప్రధాని మోడీ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారన్ని ఆరోపించారు.
అదానీ గ్రూప్ పై వస్తున్న ఆరోపణలపై సమగ్ర చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండేండ్లుగా తాను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని చెప్పారు. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, దేశ మౌలిక సదుపాయాల వ్యవస్ధను ఓ వ్యక్తి హైజాక్ చేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని ఈ రోజు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ రోజు వాయిదా పడ్డాయి.
మొదట ఈ రోజు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకు వచ్చారు. అదానీ సర్కార్ షేమ్..షేమ్ అంటూ నినాదాలు చేశారు. అదానీ గ్రూప్ షేర్ల పతనం, కార్పొరేట్ దిగ్గజం వ్యాపార పద్ధతులపై విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.