కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాజకీయ వేడిని రాజేసింది. ముఖ్యంగా ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా అని అందులో ఉంది. అంతేకాకుండా వివాదాస్పదమైన రాహుల్ పార్టీ వీడియో ఫోటోలను అందులో ప్రింట్ చేశారు.
శుక్రవారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారు రాహుల్ గాంధీ. వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నారు. శనివారం పార్టీ నాయకులతో భేటీలకు ప్లాన్ చేశారు. అయితే.. తెలంగాణకు వస్తున్న రాహుల్ కు వైట్ ఛాలెంజ్ విసురుతున్నారు టీఆర్ఎస్ నేతలు. నగరంలో వెలసిన ఫ్లెక్సీలను పోస్ట్ చేస్తూ మా కేటీఆర్ సిద్ధం మీరు రెడీనా అని ప్రశ్నిస్తున్నారు.
డ్రగ్స్ రాకెట్ తో కేటీఆర్ కు సంబంధం ఉందని గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్, బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి వైట్ ఛాలెంజ్ విసిరారు. ఆ సమయంలో విశ్వేశ్వర్ రెడ్డి ముందుగా స్పందించి తాను ఓకే అన్నారు. ఆ తర్వాత బండి సంజయ్ కూడా సరేనని చెప్పారు. కానీ.. కేటీఆర్ మాత్రం ఛాలెంజ్ ను స్వీకరించలేదు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ వైట్ ఛాలెంజ్ అంశం తెరపైకి రావడంతో రాహుల్ గాంధీ దీనికి సిద్ధమైతే.. తాను కూడా రెడీ అంటూ ప్రతి సవాల్ చేశారు కేటీఆర్.
మళ్లీ ఇన్నాళ్లకు రాహుల్ పర్యటన సందర్భంగా ఇది తెరపైకి వచ్చింది. రేవంత్ పెట్టిన వైట్ ఛాలెంజ్ ను రాహుల్ ఎందుకు స్వీకరించడం లేదని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వైట్ ఛాలెంజ్ ప్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.