కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోమవారం ఎన్నిక జరగనుంది. 137 ఏళ్ళ పార్టీ చరిత్రలో ఆరో సారి ఈ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం ‘భారత్ జోడో పాదయాత్ర’ లో బిజీగా ఉన్న పార్టీ నేత రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి తన ఓటు హక్కు వినియోగించుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసలు ఓటు వేస్తారా లేదా అన్న సందేహాలు కూడా ఉత్పన్నమయ్యాయి.
కానీ ఈ సందేహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆయన కర్ణాటక లోని బళ్లారిలో తన ఓటు హక్కు వినియోగించుకుంటారని పార్టీ సీనియర్ నేత, జోడో యాత్ర ఇన్-చార్జ్ జైరాంరమేష్ తెలిపారు. ఇక ఊహాగానాలు అనవసరమని, బళ్లారి లోని సంగనకల్లులో రాహుల్ ఓటు వేస్తారని ఆయన ట్వీట్ చేశారు.
సుమారు 40 మంది భారత్ యాత్రీలతోను, పీసీసీ డెలిగేట్లతోను కలిసి రాహుల్ తన ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో డెలిగేట్లంతా పాల్గొనేందుకు సోమవారం వీలుగా భారత్ జోడో యాత్రకు విరామం ఉంటుందన్నారు. బళ్లారిలో క్యాంప్ సైట్ వద్ద ఓ పోలింగ్ బూత్ ని ఏర్పాటు చేయాలని పార్టీ సెంట్రల్ ఎలెక్షన్ అథారిటీ నిర్ణయించిందని జైరాం రమేష్ అంతకుముందు వెల్లడించారు.
24 ఏళ్ళ తరువాత మొదటిసారిగా గాంధీయేతర వ్యక్తి ఈ పదవికి ఎన్నిక కానున్నారు. పార్టీ చీఫ్ ని ఎన్నుకునేందుకు ఉద్దేశించిన ఎలెక్టోరల్ కాలేజ్ లో తొమ్మిది వేలమందికి పైగా పీసీసీ డెలిగేట్లు ఉన్నారు. అప్పుడే బళ్లారిలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.