కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా విమర్శించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నియోజకవర్గం నుంచి కూడా రాహుల్ గాంధీ గెలవలేరని ఓవైసీ అన్నారు.
అందువల్ల తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీకి ఓవైసీ సూచించారు. ‘ రండి.. హైదరాబాద్ నుంచి పోటీ చేయండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. కావాలంటే మెదక్ నుంచి కూడా మీరు పోటీచేయవచ్చు’ అని ఎద్దేవా చేశారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. మొదటి రోజు రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రెండవ రోజు పర్యటనలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులను ఆయన కలుసుకున్నారు. ఆ తర్వాత మాజీ సీఎం దామోదరం సంజీవయ్యకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలతో ఆయన ములాఖత్ అయ్యారు.