లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ నేతలు పట్టుబట్టడంపై శివసేన(ఉద్దవ్ ఠాక్రే) వర్గం ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈ విషయంలో రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పరని ఆయన అన్నారు. అసలు ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలంటూ ప్రశ్నించారు.
ఇలా ప్రతి చిన్న విషయానికి క్షమాపణలు చెప్పాలంటే బీజేపీలో చాలా మంది కేంద్రమంత్రులు క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. పార్లమెంటులో మాట్లాడకుండా విపక్ష ఎంపీల మైకులను కట్ చేయడం, అప్పటికీ నోరు మూయకపోతే జైలుకు పంపించడం బీజేపీ సర్కారుకు అలవాటై పోయిందన్నారు.
దేశంలో ప్రస్తుతం న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడిందన్నారు. తాము చెప్పినట్లు చేయకపోతే, తామూ చూస్తామంటూ న్యాయవ్యవస్థపై కేంద్ర మంత్రి బెదిరింపు ధోరణి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని ఆయన ఫైర్ అయ్యారు. ఆ వ్యాఖ్యలకు అర్థం ఏంటని ఆయన ప్రశ్నలు గుప్పించారు. న్యాయవ్యవస్థపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పారని, కానీ ఒత్తిళ్లు ఉన్నాయని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి పార్లమెంట్ నియమాలను ఆ పార్టీ పాటించడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. రా0జ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. చివరికి సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యకలాపాల్లో, న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లోనూ కేంద్రం జోక్యం పెరిగిపోయిందని ఆయన ఆరోపణలు గుప్పించారు.