కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ రంగంలోకి దిగింది. మూడు చట్టాలను నిరసిస్తూ రైతుల తెలుపుతున్న నిరసనలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నేతల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలిపి వినతి పత్రం అందజేసింది. అలాగే కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది సంతకాలు సేకరించి.. వాటిని రాష్ట్రపతికి అందజేసింది.
రాష్ట్రపతిని కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ రైతుల కోసం కాక కార్పొరేట్ సంస్థల కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ఇద్దరు,ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని కష్టాల్లోకి నెడుతున్నారని మండిపడ్డారు. మోదీ నిర్ణయాలతో కోట్లాది మంది జీవితాలు రోడ్డునపడుతున్నాయని పైర్ అయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యం ఉహాల్లో తప్ప.. వాస్తవంలో కనిపించడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.