తెలంగాణలో కొద్దిరోజులుగా ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం నడుస్తోంది. అయితే.. ఒకరిపైన ఒకరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మధ్య ట్వీట్ ల యుద్ధం సాగుతోంది.
తాజాగా.. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్ లో సంఘీభావం చెప్పడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదని అన్నారు.
పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉండకూడదన్నారు కవిత. అక్కడ ధాన్యం సేకరించిన మాదిరిగానే తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే సమస్యపైన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు కవిత.
మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాలని రాహుల్ కు సవాల్ విసిరారు. ఒకే దేశం– ఒకే సేకరణ విధానం కోసం రాహుల్ డిమాండ్ చేయాలని కవిత సూచించారు.